కేంద్రానికి లేఖ‌: ముఖ్య‌మంత్రి మీద గురిపెట్టిన నిమ్మ‌గ‌డ్డ‌

0

నాకు, నాకుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించండి అంటున్న ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్

త‌న‌కు, త‌న కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ కోరుతున్నారు. ఈమేర‌కు ఆయ‌న కేంద్ర హోం శాఖ‌కు లేఖ రాశారు. ఏపీలో రోజుకో మ‌లుపు తిరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల అంశం లో తాజా అంకానికి ఆయ‌న తెర‌లేపారు. తనకు రక్షణ కల్పించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ‌రాయ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు త‌న‌కు రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. త‌న కుటుంబ సభ్యులతో పాటు తనపైనా దాడి జరిగే అవకాశం ఉందని రమేష్ కుమార్ లేఖలో ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తన భద్రతతో పాటు ఎన్నికల నిర్వహణకు కూడా కేంద్ర బలగాలు అవసరమని ఐదు పేజీల లేఖ కోరారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పరిస్థితులు అనుకూలంగా లేవని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరగాలంటే కేంద్ర బలగాలు అవసరమని రమేశ్ కుమార్ లేఖలో వివ‌రించారు.

మంత్రులకు సీఎం టార్గెట్ పెట్టారంటే ఎస్ ఈ సీ త‌న లేఖ‌లో కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఏపీలో జరిగిన ఏకగ్రీవాల విష‌యాన్ని కూడా ఆయన ప్రస్తావించడం ద్వారా అధికార పార్టీ తీరుని ఆయ‌న ఎండ‌గ‌ట్టేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో 24 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవాలు జరిగాయని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  కేవలం ఒకే జడ్పీటీసీ ఏకగ్రీవం అయిత ప్ర‌స్తుతం వాటి సంఖ్య‌ 126 జడ్పీటీసీలు అని చెప్ప‌డం ద్వారా రాజ‌కీయ దుమారానికి తెర‌లేపారు. క‌డ‌ప‌ జిల్లాలో 79 శాతం ఎంపీటీసీలు, 76 శాతం జడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయని లేఖ‌లో రాయ‌డం ద్వారా ముఖ్య‌మంత్రి మీద ఆయ‌న గురిపెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో తాజా లేఖ ఏపీ రాజ‌కీయాల్లో మ‌రోసారి దుమారం రేప‌బోతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here