అమ్మ ఒడి జ‌గ‌న్ సంధించిన బ్ర‌హ్మాస్త్ర‌మే!

0

మ‌రోసారి జ‌గ‌న్ త‌న రాజ‌కీయ వ్యూహాల‌కు చాక‌చ‌క్యంగా అమ‌లు ప‌ర‌చ‌డం ద్వారా స‌మ‌ర్థుడ‌నిపించుకున్నారు. అమ్మ ఒడి ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డాన్ని అక్టోబ‌ర్ నుంచి జ‌న‌వ‌రికి వాయిదా వేసిన జ‌గ‌న్ వ్యూహం దాదాపు ఫ‌లించేలా క‌నిపిస్తోంది. స్థానిక ఎన్నిక‌ల ముంగిట ప్ర‌తీ త‌ల్లికి రూ.15వేలు అకౌంట్ల‌లో జ‌మ కావ‌డం వైసీపీ విజ‌యావకాశాల‌ను మెరుగుప‌రుస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

చంద్ర‌బాబు గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముంగిట డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ఇచ్చిన పసుపు కుంకుమ ప‌థ‌కంతో కొంద‌రు పోల్చి చూస్తున్నారు. కానీ ఏద‌యినా ప్ర‌భుత్వం లేదా నాయ‌కుడు చెప్పింది చేస్తాడ‌నే అభిప్రాయం క‌లిగించ‌డ‌మే అతి కీల‌కం. అప్ప‌ట్లో చంద్ర‌బాబు అనేకసార్లు డ్వాక్రా రుణ‌మాఫీ చేస్తాన‌నే మాట‌ల‌ను ఉల్లంఘించి చివ‌ర‌కి ఓ ప‌థ‌కం పేరుతో పంపిణీ చేసినా అప్ప‌టికే ఆయ‌న విశ్వ‌స‌నీయ‌త కోల్పోయారు. దాంతో టీడీపీకి త‌ల‌బొప్పి క‌ట్టింది.

కానీ జ‌గ‌న్ ప‌రిస్థితి అది కాదు. ఆయ‌న పీఠం ఎక్కి ఏడు మాసాలు మాత్ర‌మే గ‌డిచింది. ఇప్ప‌టికే అనేక ప‌థ‌కాలు అమ‌లులోకి తీసుకొచ్చారు. న‌వ‌ర‌త్నాల్లో కీల‌క‌మ‌యిన అమ్మ ఒడిని కూడా అనుకున్న విధంగా ప్రారంభించి ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అభిప్రాయ‌న్ని క‌లిగించారు. అదే మ‌రోసారి వైసీపీకి ఉప‌యోగ‌ప‌డే అంశంగా చెప్ప‌వ‌చ్చు. స్థానిక ఎన్నిక‌ల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్న అధికార పార్టీ శ్రేణుల‌కు తాజాగా ప్ర‌జ‌ల్లో వ‌స్తున్న స్పంద‌న మ‌రింత ఊపునిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. మ‌రోవైపు ఎన్నిక‌లు ముంచుకొస్తున్నా అమ‌రావ‌తి చుట్టూ ప్ర‌దిక్ష‌ణ‌లు చేస్తున్న టీడీపీ, జ‌న‌సేన అధినేత‌ల తీరుతో ఆపార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు కొత్త చిక్కులు కూడా త‌ప్ప‌వు.

జ‌గ‌న్ త‌న అమ్ముల పొది నుంచి బ్ర‌హ్మాస్త్రాలు సంధిస్తుంటే ఇత‌ర పార్టీలు మాత్రం అందుకు భిన్నంగా సాగుతున్న తీరు గ‌మ‌నిస్తే మ‌రోసారి మొన్న‌టి ఎన్నిక‌ల ఫ‌లితాలు పున‌రావృతం కావ‌చ్చ‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. ప్ర‌భుత్వం మీద ఇసుక త‌ర‌హా ప‌లు వ్య‌తిరేక‌త‌లు ఉన్న త‌రుణంలో అమ్మ ఒడి ప‌థ‌కం ఏమేర‌కు దానిని అధిగ‌మిస్తుంది, జ‌గ‌న్ ఆశ‌లు ఎంత‌వ‌ర‌కూ నెర‌వేరుతాయ‌న్న‌ది త్వ‌ర‌లో తేలుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here